పవన్ కళ్యాణ్ పూర్తి స్పీచ్....
గొప్పగా బతకాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి!
అదేంటో నాకెపుడూ పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి.
పిరికితనంతో.. నీ బాంచన్ దొర.. నీ కాల్మొక్తా అనే వాడిని కాదు కాబట్టి నాకు కష్టాలు వస్తాయోమో !
ఢిల్లీ వారి వద్దకు మన కాంగ్రెస్ నేతు వెళ్లి దొరా నీ కాల్మొక్త అని చెప్పి చెప్పి రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు
ఢిల్లీ వాళ్లు చేసిన పనికి అన్నయ్య మీద నేను ఎందుకు కోపం చూపిస్తా!?
తండ్రి తర్వాత తండ్రంతటి అన్నయ్యకు నేనెందుకు ఎదురెళ్తాను. ఇపుడు నా దురదృష్టం కొద్దీ అన్నయ్యకు ఎదురెళ్తున్నా తప్ప గుండెల్లో ఉన్న అన్నయ్యను ఎదురించడానికి కాదు.
ఏదో శుభ్రంగా సినిమాలు చేసుకుంటూ చాలీచాలని డ్యాన్సులు చేసుకుంటూ మీకు (ప్రేక్షకులకు) ఆనందం కల్పిద్దాం అంటే ఉండనివ్వట్లేదు. అందుకే మీ ముందుకు వచ్చాను. ఐదేళ్ల క్రితం గుంటూరులో ఆఖరి రాజకీయ ప్రసంగం చేశాను. ఆ తర్వాత ఎప్పుడూ రాజకీయాల గురించి, ప్రజా సమస్య గురించి గాని నోరు విప్పలేదు. అది నేను భగవంతుడికి వదిలేశాను. కానీ… నేడు రాష్ట్రం పరిస్థితి, తెలుగు వారి పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది.
కొందరు పదవుల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాననుకోవచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కావాలని లేదు అవన్నీ నాకు తుఛ్చమైనవి. మీరు చూపించే అభిమానం ముందు, ప్రేమ ముందు అవి నిలవవు.
కానీ.. రాష్ట్ర రాజకీయాల గురించి గురించి, మన తెలంగాణ గురించి మన పోరు తెలంగాణ గురించి సీమాంధ్ర విడిపోయిన పరిస్థితులు గురించి. ఎలా విడగొట్టారో, ఎలాంటి పరిస్థితుల్లో విడగొట్టారో చూసి విసుగొచ్చింది. రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది. ఒక నిర్దిష్టమైన ఆలోచన తోటి,ఒక సుదీర్ఘమైన లక్ష్యం తోటి మీ ముందుకు వచ్చి ఇలా పార్టీ పెట్టాను. దానిపేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, భారతదేశపు సేన. అదిగో అదీ జెండా (జెండా వైపు చూపిస్తూ).
….
ఇక తిట్లు, విమర్శలు, నోటి కొచ్చినట్లు తిడుతున్నారు. చూస్తా ఉన్నా, పౌరుషం లేదా, చేతకాదా చూద్దాం. భరిస్తాం. నేను పార్టీ పెడుతుంటే
ఇపుడెందుకు ?
ఇపుడు వచ్చి ఏం చేస్తావు?
2019 కి రా!
పోయిన సారి చేసిన రాజకీయాలు చాలు!
అని ఎన్నో మాటలన్నారు. ఇంకా చాలా ఉన్నాయిలెండి.
…
నేను రాజకీయం గురించి మాట్లాడతాను అని చెప్పాక..
క్షమాపణలు చెప్పమన్నారు. అది అడగడానికి మీరెవరు?
మీరెవరండీ చెప్పడానికి…!
ఢిల్లీ నాయకుడు ఒకాయన, అదే దిగ్విజయ్‌సింగ్ గారు ’పవన్ పార్టీ పెట్టమ్మా… కాంగ్రెస్ లో కలపమ్మా’ అన్నారు. అదేమన్నా గంగానదా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను దిగ్విజయ్ సింగ్?
చివరకు ఒకాయన, అదే నేను అన్నయ్య తర్వాత బాగా అభిమానించే రెండో వ్యక్తి కేసీఆర్ అంటాడు (కేసీఆర్ సభల్లో అడిగే తీరులోనే పవన్ కూడా ఆయన పేరును అడిగినట్లు నటించాడు)
‘ఆంధ్రోళ్లు సంక్రాంతికి కొత్త దుకాణం పెట్టారు’ అంటూ విమర్శలు చేశారు.
”ముందు నన్ను చెప్పనీరాదే
చెప్పినాక నువ్వు తిడితే పడతా
నన్ను విమర్శించేవారందరికీ పేరు పేరునా చెబుతున్నా
”మీ విమర్శలకు భయపడతాననుకుంటున్నారా?
ఇలాంటి పిరికితనం అంటేనాకు పడదు
చచ్చిపోతా గాని భయపడను.
…
పార్టీ నిర్ణయం తీసుకుని ఒక ప్రెస్‌రిలీజ్ విడుదల చేశాక నాలో అనేక ప్రశ్నలు తలెత్తాయి.
”అరె నీకు రాజకీయాలు అవసరమా? సినిమాలు చేస్తున్నావు, నాలుగు డబ్బులొస్తున్నాయి హాయిగా చేసుకోకూడదూ… ఏదో తోటకు పోయి మామిడి చెట్టుకింద ఉండకుండా” అని ఇలా ఆలోచించాను. రూంలోకి వెళ్లి నా ముగ్గురు పిల్లలను చూశాను. ఒకరికి మూడు, మరొకరికి నాలుగేళ్లు. అబ్బాయికి ఏడెనిమిదేళ్లు ఉంటాయి. ’నేను వాళ్లని వదిలెళితే వాళ్లెలా ఉంటారు. అనిపించింది”
…
సైద్ధాంతిక బలంతోనే రాజకీయాలు చేయగలం. నాలాంటోన్ని చంపినా చంపేస్తారు. సమాజం కోసం నిస్వార్థంగా పనిచేయాలంటే ప్రాణాలకు తెగించాలి. నా దేశం, నా సమాజం ముఖ్యమా? నా కుటుంబం ముఖ్యమా? అనుకున్నపుడు నా కుటుంబం చిన్నదిగా అనిపించింది. నాకు వ్యక్తిగత శత్రువులు లేరు. నాకు కోపం వస్తుంది. కానీ దాచుకోను. అదప్పుడే ఆరిపోతుంది. కక్ష్య సాధించే మనసు లేదు.
నా నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారు. నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాసుతో సహా. నాకు అండగా నిలబడింది ఒకరే. వరంగల్ రాజు. చాలా మంది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమైంది? అని అడుగుతున్నారు. వదిలేశాను అనుకున్నారు. వదిలేయలేదు. అది నా మనసులో ఉంది. ’సీపీఎఫ్ యే ’జనసేన’ అయ్యింది. నేను, రాజు ఇద్దరూ ఎంతో మధించాం. శోధించాం. రోజుకు ఏడెనిమిది గంటలు చర్చించే వారం. అప్పటికింకా పార్టీ ఆలోచన లేదు.
మీకు (అభిమానులకు) సినిమాల ద్వారా దూరమైతే అది నా తప్పు కాదు. నేను వాటిని వదులుకోవడానికి కారణం ఢిల్లీ వాళ్లు. మీ కోపం వారిమీద చూపండి (నవ్వుతూ).
…
పార్టీ నిర్ణయం తర్వాత ఏం చేయాలి? ఎక్కడికెక్కాలి? అని తీవ్రంగా ఆలోచించాను. నా చిన్నప్పటి అమ్మమాట నాకు ఎప్పటికీ గుర్తే.
”మతి ఎంతో గతి అంతే” అని మా అమ్మ అనేది.
నా సామాజిక స్పృహకు కారణం… ఓ చిన్నప్పటి సంఘటన. స్కూలు తెరిచాక చాలా రోజులకు గాని పుస్తకాలు రావు. ఆ సందర్భంలోనే ఒక చిన్న సంఘటన వల్ల పోలీసు స్టేషనుకు వెళ్లాను. నెల్లూరు టూ టౌను పోలీస్‌స్టేషను అనుకుంటా. మూడు నాలుగు గంటలున్నా. మా నాన్న పోలీసు. అయినా వారికి తెలియక నన్ను వదల్లేదు. ఆ తర్వాత ఒక ఎస్సై వచ్చారు. ఆయన నెత్తిమీద రెండు కొట్టి పంపించేశారు.
ఒక సామాన్యుడి బాధ ఏంటో అపుడే తెలిసింది.
….
చదువు మీద ఆసక్తి పోయి పరిశీలన మొదలుపెట్టాను . బయట ఒకటి, లోపల ఒకటి మాట్లాడేవారిని చూస్తే నాకు చాలా వింతగా ఉంటుంది. ఏంటో ఈ లోకం. అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. విచితంగా జరుగుతుంటాయి. ఒకసారి మా అక్క నేను బయటకు వెళ్తే ఒకడు అక్క చేయి పట్టుకున్నాడు. అపుడు నేను చిన్నోడిని. అర్థం చేసుకునే శక్తి లేదు. ఎవరో అక్కను కాపాడి ఇంటికి తీసుకువచ్చారు. ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి ఇంటికి రాలేదా? మన సమాజం డబ్బున్నోళ్లకి, పరపతి ఉన్నోళ్లకి తప్ప సామాన్యులను రక్షించదా?
…
పదో తరగతిలో విప్లవ సాహిత్యం చదివాను, సాయుధ పోరాటాలు చదివాను. అపుడే తెలంగాణ సాయుధ పోరాటం గురించి చదివాను. కొంతమందిలా ’కొత్తగా ప్రేమొచ్చి’ చదవలేదు. దీంతో ఇక్కడుంటే చెడిపోతాను అని ఇంట్లో వాళ్లు మద్రాసు పంపారు. స్థలం మారింది, ఆలోచన మారితే కదా అదే బుద్ధి. అక్కడ ఒక గొడవ జరిగింది. డీఎంకే నాయకుడు ఒకరు సెటిల్ చేశారు. తిరుగుబాటు పోలేదు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెబుతున్నాను.
అందరూ నేను ఏం చేయకపోయే సరికి ఊరికే తిడుతుండే వారు. లోపల ఏదైనా చేయాలని చాలా ఉండేది. ఆలోచన, ఆవేశం ఉంది…. చేసే సామర్థ్యాలు లేవు. చిన్నపుడు కోతికొమ్మచ్చి ఆడాను. అంతే అవి తప్ప నాకు ఆటలు కూడా తెలియదు. ఆ తర్వాత ఇప్పటి వారికి ఆ అలవాటు కూడా లేదనుకోండి.. ఎందుకం మనోళ్లు ’చెట్లు కొట్టేశారు. చెట్లుంటే కదా కోతికొమ్మచ్చి ఆడేది’.
నాకు ఏదీ మనశ్శాంతిగా ఉండేది కాదు. కోపంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా అయినా ఫలితం దక్కలేదు. యోగా, ధ్యానం నేర్చుకున్నా ఉపయోగం లేదు. ఎపుడూ బాధలు, సమస్యలు కనిపిస్తుంటే మనశ్శాంతి ఎలా వస్తుంది? ఒకసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా. మంచి అన్నయ్యలు ఉండటం వల్ల అలా జరగనివ్వలేదు. నా అశాంతి గురించి వారికి చెబితే ’తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండి, అన్నీ ఉంటే నువ్వు ఇలా ఎన్నికథలన్నీ చెప్తావనేవారు. అపుడు అనిపించింది. ఒకవేళ నేను ఏదో ఒకటి సాధించినా నాలో ఇలాంటి ఆలోచనలే ఉంటాయా అని?అదే ఆలోచన నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టింది.
రేపు పొద్దున నా పిల్లలు ఏమవుతారో తెలియదు. అన్నిటినీ వదులుకుని వచ్చాను. దేశంపై ప్రేమతో, సమాజం పట్ల బాధ్యతతో. రాజకీయాలు ఉన్నది సమస్యలు పరిష్కరించడానికి గాని వాటిని మరింత జఠిలం చేయడానికి కాదు.. నాకు ప్రతి పార్టీలోనూ కాంగ్రెస్‌తో సహా పలువురు నాయకులు తెలుసు. వారితో మాట్లాడుతా. కలిసినపుడు కౌగిలించుకుంటాను కూడా. కానీ వాళ్లతో సైద్ధాంతికంగా నేను ఏకీభవించలేను. వాళ్ల ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఇపుడు పార్టీ పెట్టాం. ప్రతి పార్టీని, అందరు నేతలను ఎదుర్కొంటాం.
…
తెలంగాణకు వ్యతిరేకం కాదు. కానీ ఘోరంగా విభజించారు. సీమాంధ్రను అవమానించారు. నేను ఊరుకునే వ్యక్తి కాదు. అందుకే వచ్చాను. భగత్‌సింగ్ తెలుసుకదా మీకు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఉరితీస్తామన్నారు. చివరకు మన గాంధీ కూడా క్షమాపణ అడుగు వదిలేస్తారు అన్నాడు. కానీ భగత్‌సింగ్ వినలేదు. ’నేను రాబోయే తరాల కోసం చస్తున్నా. నా కోసం కాదు. నేను ఎందుకు చనిపోయానో వారికి తెలియాలి. నేను క్షమాభిక్ష అడగను’ అని గాంధీకి కూడా చెప్పారు. అంత చిన్న వయసులో భగత్ సింగ్ తన గురించి, తన దేశం గురించి, తన భారత భావి పౌరుల గురించి ఆలోచించారు. ఆయన స్పూర్తే నేను !! ఆయన స్ఫూర్తి నాలో ఉంది. భగత్ నేను ఉన్నాను మీ ఆశయాలతో!
..
ఇక పార్లమెంటులో జరిగిన ఘోరం గురించి ఏం చెప్పాలి? రాజ్యసభలో వెంకయ్యనాయుడు సీమాంధ్ర కోసం ఎన్నో పాట్లు పడ్డారు. ఆయన జై ఆంధ్ర నాయకుడు. ఆయన తపన నాకు నచ్చింది. నేను ఆయన గురించి ఇలా అనుకుంటే ఆయన నా గురించి ఏమనుకున్నారో మీకు తెలుసా? ‘పవన్ పాలిటిక్స్ లోకి వస్తాడంట దేశానికి ఇది దౌర్భాగ్యం కాకపోతే మరేంటి?” అన్నారు. వెంకయ్యగారు మీరింత అనుభవజ్ఞులై ఉండి ’ఎంతో గౌరవంగా తేవాల్సిన మన తెలంగాణను మీరెలా తీసుకువచ్చారో మనం చూశాం.. అది కాదా దేశానికి పట్టిన దౌర్భాగ్యం.?”
నాకు నచ్చింది జగ్గారెడ్డి గారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందాం అనే విషయాన్ని నిజం చేయగలిగిన వారాయన ఒక్కరే. ఆయన నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగి ఉంటే అది సాధ్యమై ఉండేది.
నాకు ఇష్టమైన మరో వ్యక్తి వి.హనుమంతరావు. విభజన సమయంలో ఆయన బస్తీల్లో తిరిగి సీమాంద్రులకు అభయం చెప్పారు. మీకేం కాదన్నారు. అది నాకు నచ్చింది. ఆయన గురించి నేను ఎంతో సంతోషపడ్డాను. మరి నేను ఆయన గురించి ఇలా ఆలోచిస్తే ఆయన నా గురించి ఏం ఆలోచించారో తెలుసా? ”వాడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడు? మా రాహుల్ గాంధీ ఒక్క పెళ్ళి కూడా చేసుకోలేదు.” అన్నాడు. ఆ వాక్యంలో నాకు ఒకటి అర్థమైంది. ’రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదు గాని బ్రహ్మచారని చెప్పలేదు’. హనుమంతురావు గారూ…. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే రాజకీయాలకు పనికిరారు అంటున్నారు. ఒకే పెళ్లి చేసుకుని 30 మందితో తిరగొచ్చా? లోనవాలా రిసార్టులో అలా తిరిగిన వారు ఎవరో మీకు తెలియదా? నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తే మీ వ్యక్తిగత జీవితం బయటకు వస్తుంది. ”రాబర్ట్ వద్రా, రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని ప్రతి నాయకుడి వ్యక్తిగత జీవితం బయటకు తీస్తా. మీకు సీబీఐలు కావాలేమె నాకు అభిమానులు చాలు. ఒక నెంబరు ఇస్తే అన్నీ నా దగ్గరకు వస్తాయి”. ఏ పార్టీకి చెందిన వారయినా సరే, ఏ రంగం వారయినా సరే, నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తే నేను వారి వ్యక్తిగత జీవితాలు బయటకు తీస్తాను. ఇంటర్‌నెట్ ఉంది. ఫేస్ బుక్ ఉంది. ట్విట్టరు ఉంది, యూట్యూబు ఉంది. మీకు ఓకేనా. నేను లోపల కూడా ఎవరినీ విమర్శించను. ప్రజా జీవితానికి వ్యతిరేకంగా ఉంటే విమర్శించకుండా వదిలిపెట్టన.
‘ఒకరి ఇంట్లో ఏం జరుగుతాయో ఎవరికీ తెలియవు. మీకు తెలియని విషయాలను బయట నుంచి చూసి విమర్శించకండి. నా జీవితంలో ఏ పరిస్థితుల్లో విడిపోయానో, ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో మీకు తెలుసా? ఆ స్త్రీలకు వ్యక్తిగత జీవితాలు ఉండవా? వారిని ఎందుకు అగౌరవపరుస్తారు. ఎందుకు వారి మనసు బాధపెడతారు?
…
పొద్దున్నే చూశా… జన జాగృతి అధ్యక్షురాలు కవిత ఏమన్నారంటే పవన్ కళ్యాణ్, నువ్వు ఒక భారత పౌరుడిగా నీకు పార్టీ పెట్టే హక్కుంది గాని. ముందు తెలంగాణకు క్షమాపణ చెప్పాలి’ అంది. అవును నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకు, అభిమానులకు నేను క్షమాపణ చెప్పాలా, లేదా?అన్నది మా వ్యక్తిగత విషయం. అది మీకు సంబంధం లేదు. ’అమ్మా కవిత, తల్లీ నువ్వు నా చెల్లెలి లాంటి దానివి. ఒక అన్నగా నీ బాధను అర్థం చేసుకున్నాను. నీ అసలు అన్నయ్య కేటీఆర్ భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక తెలంగాణ ప్రజా సంఘాల నాయకుడు నాకేం చెప్పారో తెలుసా! కవిత చాలా విరాళాలు సేకరించారు అన్నారు. నా ఎన్నారై మిత్రులు కూడా మేము కూడా పంపామని చెప్పారు. మీరు దయచేసి ’ఆ సంస్థ విరాళాల వివరాలు, అక్కౌంట్లు తెలంగాణ ప్రజా సంఘాలకు చెప్పండి.
…
నేను గత ఎన్నికలపుడు గాంధీభవన్ వెనుక భీంరావ్ గూడ లోకి వెళ్లాను. ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారో తెలుసా? వారిని ఖాళీ చేయించారు. అభివృద్ధి కోసం ఖాళీ చేయించడం తప్పుకాదు. కానీ వారు ఖాళీ చేయించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసమట. నేను అక్కడికి వెళ్లినపుడు’అప్పుడే వండుకున్న అన్నం, ఒక దేవుడి ఫొటో’ కింద పడి ఉంది. హృదయం ద్రవించింది. కాంగ్రెస్ పెద్దలారా? మీకు అదే స్థలం కావాలా? హైదరాబాదులో చాలా ఖాళీ ఉంది. దోచుకున్న డబ్బులున్నాయి కదా.. పెద్దపెద్దవి కట్టుకోండి. చిన్న గుడిసెల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. వారు మనసులు అంతగా గాయపరచాలా?
‘ఖాళీ చేసిన వారు వేరే స్థలాలకు వెళ్లాక నేను అక్కడికి వెళ్లాను. ఒకావిడతో మాట్లాడితే మనసు గాయపడింది. ఆవిడకు ఒక కూతురు ఉంది. బాత్ రూం లేదు. నా బిడ్డ స్నానం చేస్తుంటే చూసి అక్కడి కొందరు అల్లరి మూకలు అల్లరి పెడుతున్నారంట. ఇదీ కాంగ్రెస్ నిర్వాకం. మన ఢిల్లీ పెద్దలు ఎంత దౌర్భాగ్యులంటే స్వాతంత్య్రం వచ్చాక అరవై ఏళ్లకా నిర్భయ చట్టం? ఇంతకాలం ఏం చేశారు. ఒక ఆడపిల్లను నలుగురు అత్యంత పాశవికంగా నాశనం చేస్తే గాని మీకు తెలిసి రాలేదు. అది కూడా ఢిల్లీలో జరిగి ఉండకపోతే ఇప్పటికీ ఆ చట్టం వచ్చేది కాదు.
ఈ నాయకులు ఎంత దుర్మార్గులంటే అపుడు వరంగల్‌లో స్వప్నికపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె కాలిపోయిన శరీరంతో బాధపడుతుంటే ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు. వీళ్లు మనుషులా? అక్కడ రాజకీయాలు, ఫొటోలు, స్టిల్స్. నేను కూడా అక్కడికి వెళ్లాను. కానీ లోపలకు వెళ్లలేదు. ఆమెకు ఎవరో చెబితే రమ్మని చెప్పింది. నేను వెళ్లినపుడు ఆమె అడిగింది ఒకటే…’ఏ ఆడపిల్లలకు ఇలా జరగకుండా చూడండి’ అని!!!
అసలు వీళ్లకు చట్టసభలంటే ఏమైనా గౌరవం ఉందా? వాటి గౌరవాన్ని ఎంత దారుణంగా పాడుచేశారంటే… పార్లమెంటులో బయట కూడా మాట్లడలేనంత నీచంగా మాట్లాడుతారు. ఈ నాయకులు పాలించే వారు కాదు. వేధించే వారు. ఒకసారి నల్గొండ ఫ్లోరైడు బాధితులకు మంచి నీళ్లు ఏర్పాటుచేద్దామని అభిమానులు ప్రయత్నిస్తే మీది ఏ పార్టీ అని అడిగి అడ్డుకుంటారు. వీళ్లా నేతలు.
….
ఒకసారి ఒక తెలంగాణ వ్యక్తితో నేనే స్వయంగా తిట్లు తిన్నా. తిడుతుంటే… నాకు ఒక విషయం అర్థమైంది. ఆయన బాధ నామీద కాదు. దశాబ్దాలుగా వారు చూస్తున్న అవ్యవస్థ మీద. నాకు విషయం అర్థం అయ్యింది. అర్థం చేసుకుని అడగబోతే ఆయన ఏమన్నాడో తెలుసా…. ’నీ యమ్మ ఆంధ్రోడి బుద్ధులు చూపిస్తున్నావా” అన్నాడు. అయినా నాకు కోపం రాలేదు. ఎందుకంటే నాకు వాస్తవం తెలుసు. ఆంధ్రులను ఎలా చూస్తున్నారంటే దక్షిణ అమెరికా అర్జెంటీనాలో ఉండే చెగువేరా ఫొటో పెట్టుకునే హక్కుంది. కానీ ’కొమరం భీం’ ఫొటో పెట్టుకోకూడదా..? ఈ కోపం వారికి నా మీద కాదు,దశాబ్దాల అణచివేత నిర్లక్ష్యం మీద.
…
2009కి మునుపు తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగేవాళ్లం. ఇపుడు ఎంత దారుణంగా తయారైంది పరిస్థితి…. ’సెట్లు తగలబెట్టడం.. బెదరించడం’ ఇది తెలంగాణ ప్రజలు చేసింది కాదు రెచ్చగొట్టే తెలంగాణ నాయకులు చేసింది. ఇలా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే బయటివాడు వచ్చి మనల్ని దోచుకుంటూ ఉంటాడు. చైనా వాడు వచ్చి అస్సాంను, పాకిస్తానోడు వచ్చి కాశ్మీరును తీసుకెళ్తాడు.
కొంతకాలం కిందటి మాట. ఒక వైపు సీమాంధ్ర ఉద్యమం ఉధృతంగా అవుతోంది. ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు. అది చూసి ఏం చేయలేకమధ్యలో నేను నలిగిపోతున్నపుడు కొందరు నేతలు అక్కడి నుంచి వచ్చారు. మీరు వచ్చి సీమాంధ్రకు నాయకత్వం వహించండి. అక్కడ నాయకత్వం వహించడానికి ఎవరూ లేరు. ఇపుడు మీరొస్తే సీఎం అయిపోతారు… అని చెప్పారు. ’ఎట్లా పోగలను. ఈ పదవులు, అధికారాలు సమాజ హితవు కోరుకునే వాడికి సంతోషమిస్తాయా?
నన్ను ఎవడైనా ఆంధ్రోడంటే బాధ కలుగుతుంది. నేను భారతీయుడిని, నాకు కులం, మతం, ప్రాంతం లేదు.
పొద్దున్నే పేపర్లో చూశాను కాపులు పవన్ కళ్యాణ్‌ను ఒప్పుకోవట్లేదు అన్నాడు ఒకాయన. మీరెవరు నన్ను ఒప్పుకోవడానికి? నేను మిమ్మల్ని అడిగానా? ఇన్ని కోట్ల మంది తెలంగాణ ప్రజలు నాకిచ్చిన అభిమానాన్ని నేను ఒక వర్గానికి తాకట్టుపెడతానా ? అలా చేయగలడా నాలాంటి వాడు?
…
ఈ దేశం సనాతన ధర్మంతో నడుస్తుంది, ఇది కర్మభూమి. మహానుభావులు పుట్టిన భూమి. రక్తపాతాలు జరిగేలా ప్రాంతాల కోసం ఇక్కడ కొట్టుకోరు. ప్రజలను విడదీయాలని చూస్తే నాశనమైపోతారు. నేను కూడా చూస్తూ ఊరుకోను. అలా చేసే వారి తాటతీస్తాను. ఒబామా ఈరోజు అమెరికా అధ్యక్షుడు అయ్యాడంటే ఎందరో నల్లజాతి యోధుల పోరాటాలే కారణం. అమెరికాకు చెందిన మార్టిన్ లూథర్‌కింగ్‌ను నెహ్రూ ఒకసారి ఇండియాకు ఆహ్వానించారు. అపుడు ఆయన ముంబై వచ్చారు. అక్కడ పక్కపక్కనే ఆకాశహార్య్మాలు-మురికివాడలు ఉండటం చూసి ఇంత అసమానత ఉన్నా కూడా ఇక్కడి ప్రజలు కొట్టుకోకుండా, సంతోషంగా గడిపేస్తున్నారు. ఇలా మాదేశంలో ఉంటే రక్తపాతాలు జరిగేవన్నారు. ఇది కర్మభూమి. అలా జరిగే అవకాశం లేదిక్కడ.
నాయకులకు చెబుతున్నా ’ఎంత మంది రెచ్చగొట్టినా ఇక్కడ ప్రజలు విడిపోరు. అవి మీ పగటి కలలు. ఇలాగే మీరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే మీరు నాశనమైపోతారు. మీరు విడగొట్టగలిగింది ప్రాంతాలను మాత్రమే’.
…
కొందరు అంటున్నారు మా భాషను అవమానించారు అని ఇక్కడ బమ్మెర పోతన చక్కటి తెలుగులో రాసిన ఓ పద్యం చదివి ఇది కూడా తెలంగాణ భాషే. యాసే. మీరు రెచ్చగొట్టే భాష మాత్రం కాదు. ’నెత్తులు పగులుతాయి? నాలుకలు కోస్తాం, బొక్కలు పగలకొడతాం’ ఇదా తెలంగాణ భాష? కానే కాదు. దీని గురించి కంచె ఐలయ్య స్పందిస్తూ ఈ మాటలన్నీ భూస్వామ్య దురహంకారానికి నిదర్శనం అన్నారు. మేము అవమానించే వాళ్లమా? గద్దరు నెల్లూరు టౌను హాల్లో ’బండెనక బండికట్టి నీ ఘోరీ కడతాం కొడకో నైజాం సర్కారోడా’ అని పాడితే గంతులేసిన మనిషి నేను ”భావం ముఖ్యమా? భాష ముఖ్యమా?” చెప్పండి
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, నెల్లూరు, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి గొప్ప వాళ్లు వచ్చారు. ఎవరెక్కువ అని అడిగితే ఏమని చెప్పగలం. అందరూ ఎక్కువే. అందరూ గొప్పవాళ్లే. గొప్పవాళ్లు పుట్టారు, పుడుతూనే ఉంటారు అన్ని చోట్లా, అన్ని ప్రాంతాల్లో.
ఇలాంటి ’ఎవరెక్కువ’ రెచ్చగొట్టే పద్ధతి మానుకోండి, వీటిలోనూ రాజకీయాలు మానుకోండి. విడిపోయిన తరువాత బూతులు తిడితే బంగారు తెలంగాణ రాదు. కేసీఆర్ గారు మీరు ఎకరాకు కోటి ఎలా సంపాదిస్తున్నారో తెలంగాణ రైతులందరికీ చెప్పండి. వారు సంపాదించుకుని బాగుపడతారు. అపుడు అందరూ మీకు జైకొడతారు. నేను కూడా !
తెలుగు ప్రజలు ఎమోషనల్ ఫూల్స్ . వారు నమ్మితే బాగా నమ్ముతారు అంతే. దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు దేశమంతా ఓడిస్తే కాంగ్రెస్ వల్లేను తెలుగువారు గెలిపించారు. అలాంటి తెలుగు వారికి ఇలాంటి దుస్థితి తెచ్చింది ఆ పార్టీ.
మీరు తెలంగాణ ఇచ్చే మనుషులు కాదా? మీకు నిజంగా తెలంగాణ ఇవ్వాలనుంటే 2009 నుంచే మొదలుపెట్టాల్సింది. తెలంగాణ ఇవ్వాలంటే ఇంతమంది చావాలా? అంతమందికి కడుపుకోత అవసరమా? అంతమందిని ఎం దుకు చంపారు? మీరెందుకు బాధ్యతగా భావించలేదు. రాహుల్,సోనియా సీమాంధ్రకు వెళ్లి ఇదిగో తెలంగాణ ఇవ్వాలనుకుంటున్నాం, మీకు ఏమివ్వాలో చెప్పండి, అని ఎందుకు అడగలేదు.
మీరిచ్చిన తెలంగాణ ఎలా ఉందంటే వీళ్లకీ సంతోషం లేదు. వాళ్లకీ సంతోషం లేదు. రాజధాని ఉమ్మడిగా ఉంచారు. తెలంగాణ వాళ్లు వద్దంటున్నా భద్రాచలం ప్రాంతాలను సీమాంధ్రలో కలిపారు. వారికేమో రాజధాని లేకుండా చేశారు. దానికేం చేయాలో అర్థం కావట్లేదు ప్రజలకు. ఇపుడున్న నాయకులపై నమ్మకం లేదు. అభయహస్తం (కాంగ్రెస్ గుర్తు) వెన్నుపోటు పొడిచింది.
….
ఇది నిరంకుశ కాంగ్రెస్. అప్పులతో కూరుకుపోతున్న దేశాన్ని బతికించింది ఎవరు? మన తెలుగు వాడు పీవీ నరసింహారావు. ఆయనకు అంత్యక్రియలు కూడా సరిగా చేయలేదు. ఆ ఢిల్లీ పెద్దలకు ఆయన నచ్చలేదు. ఇక్కడి కాంగ్రెస్ తెలంగాణ నేతలకు ఆయన నచ్చలేదు. ఏమిటిది? వీరు ఈరోజు తెలంగాణను పునర్నిర్మిస్తాం అని చెబుతున్నారు.
రాహుల్ కు ప్రధాని అవ్వాలనుంది. ఆయనకు నిజంగా ఆ కోరిక ఉంటే వాళ్ల అమ్మమ్మ నుంచి రాజకీయం నేర్చుకోవాలి. ప్రజలతో మెలగడం ఆమె నుంచి నేర్చుకోవాలి. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం జరుగుతుంటే అప్పుడు ఆ శాఖా మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ వారి మనసు తెలిసి మసలుకున్నారు. తప్పును దిద్దుకున్నారు. అదీ నాయకత్వం అంటే.
జైరాం రమేష్‌ను మౌంట్ బాటన్‌తో పోలుస్తూ కాంగ్రెస్ పాలిటిక్స్ కు నిలువెత్తు నిదర్శనం ఆయన. సీమాంధ్రకు పోతాడు ’నేను వ్యక్తిగతంగా తెలంగాణకు వ్యతిరేకిని. కానీ ఇచ్చేశాం అంటాడు. మళ్లీ ఇక్కడికి వచ్చి…. తెలంగాణలో మాట్లాడుతూ ’యూటీ గురించి చిరంజీవి మాట్లాడితే తలపట్టుకు కూర్చున్నా’ అంటారు. మీరు వాస్తవంలోకి రండి. మేము మీ నాటకాలు చూసి అలసిపోయాం.
నాకు వారి మీద కోపం. నేతల మీద కోపం, అవ్యవస్థ మీద కోపం. తిరుగుబాటు చేసి ఎండగట్టాలనుంది. అందుకే వచ్చాను.
సోనియా గాంధీతో సహా ఎవరినీ వదిలిపెట్టను. ఎవరైనా కానివ్వండి. జాతీయ సమగ్రతను చెడగొట్టినట్టు తెలిస్తే ఊరుకోను. మీర జిహాదీలను చూశారు. ఒక ప్రాంతం కోసం చచ్చే వారిని చూశారు. కానీ దేశం కోసం చచ్చిపోయే మొదటి వాడిని నేనే. గుర్తుపెట్టుకోండి.
‘పాతబస్తీ నుంచి కొందరు ముస్లింలు వచ్చారు. వాళ్లు నన్ను అడిగారు. ’మా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ హిందువులను తిడితే దేశ సమగ్రతకు భంగం కలిగించినందుకు కేసు పెట్టారు. కేసీఆర్ తిడితే ఆయన ఎందుకు కేసు పెట్టరు. మరి హిందువులను ముస్లింలు తిడితే దేశ సమగ్రతకు భంగం కలిగింది. హిందువులు-హిందువులు తిట్టుకుంటే సమగ్రతకు భంగం కలగదా?
ఒకటే చట్టం… రెండు రకాలుగా ఎలా పనిచేస్తుంది?
అది న్యాయ వ్యవస్థ చెప్పాలి. సుప్రీంకోర్టు చెప్పాలి. దానికి నా దగ్గర సమాధానం లేదు.
………….
జనసేన లక్ష్యాలు ఇవి;-
అన్ని వర్గాలకు, పెద్దలకు, పేదలకు చట్టం ఒకే విధంగా పనిచేయాలి
బ్లాక్ మార్కెట్ (నల్ల బజారు) క్రమక్రమంగా నిర్మూలన
వాతావరణ కాలుష్యం మీద పోరాటం!
స్త్రీకి స్వాతంత్య్రం, రక్షణ, గౌరవంతో కూడిన భద్రత
వైద్యం సర్కారు ఆస్పత్రిలోనే కార్పొరేటులాగా అందించడం
జనసేన ఐడియాలజీ కులమత ప్రాంతాలకు అతీతం
ఇపుడు డబ్బుల్లేవు. పార్టీ పెట్టడానికి అయిపోయాయి. వచ్చే రెండేళ్లలో పార్టీ నిర్మాణం పూర్తిగా జరుగుతుంది. బాధ్యత వహించే యువ నాయకుల కోసం నేను వెతుకుతున్నాను
దేశం కోసం మాత్రమే పనిచేస్తుంది. వేలకోట్లు సంపాదించుకోవడానికి రాలేదు, టీవీలు పెట్టడానికి రాలేదు. ప్రజా ధనం దోచేస్తే ఊరుకోను. నా దగ్గర గూండాల్లేరు. మీరున్నారు (అభిమానులు) చాలు. సైద్ధాంతిక బలం ఉన్న మీరు చాలు. అట్నుంచి ఇటు దూకే వాళ్లను నా పార్టీలో పెట్టను. జోకర్స్,జంపర్స్ నాకు వద్దు.
ఇంకా చెప్పాలంటే నాకు టీఆర్‌ఎస్ నాయకులంటే అంతో ఇంతో గౌరవం ఉంది. వారు ఒకేసిద్ధాంతంతో పోరాడారు.
…
కాంగ్రెస్ తో తప్ప దేంతో అయినా చేతులు కలుపుతా
ముందు ప్రజలు సుఖంగా ఉండాలి. బందులు ఆగాలి. పది మంది బాగుండాలి. ఇలాంటి కొన్ని సిద్ధాంతాలున్నాయి. వాటిపై అందరు నాయకులతో మాట్లాడతాను. ప్రతి ఒక్కరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాను.
జైరాం రమేష్, షిండే , చిదంబరం, వీరప్ప, ఆంటోనీ, యావన్మందీ కాంగ్రెస్ నేతలూ వినండి…
తెలుగు ప్రజల తరఫున, దేశ ప్రజల తరఫున చెబుతున్నా, దేశానికి పిలుపునిస్తున్నా.
”కాంగ్రెస్ హఠావో దేశ్ కీ బచావో”